Facebook

Header Ads

అవంతి పార్టీ మారటం వెనుక ఒకే ఒక్క బలమైన కారణం ఏంటో తెలుసా!

అవంతి పార్టీ మారటం వెనుక ఒకే ఒక్క బలమైన కారణం



అవంతి శ్రీనివాసరావు ఈసారి ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి మంత్రి పదవి చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ఆయన దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకున్నారు. ఆయన అనకాపల్లి ఎంపీ కాక ముందు భీమిలి ఎమ్మెల్యేగా చేశారు. గత ఎన్నికల సమయంలో పార్టీ ఎంపీగా వెళ్లమంటే అయిష్టంగానే పోటీ చేశారు. అయినా మనసు భీమిలిని వీడిపోలేదు. అక్కడి నాయకులు, కార్యకర్తలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే అవంతికి భీమిలి నుంచే పోటీ చేయాలని మహా కోర్కెగా ఉంది. అక్కడైతే తనకు గెలుపు సులువని ఆయన నమ్మకం. అందుకే ఆ సీటే కావాలని జగన్‌ను కోరారు.

గెలిస్తే కాపుల కోటాలో తనకు మంత్రి పదవి కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దానికి అక్కడ హామీ ఇవ్వడంతో వెంటనే పార్లమెంటు సమావేశాలు ముగిసిన మరుసటి రోజునే వైసీపీలో చేరిపోయారు. 

అయితే గత ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వంలో కొనసాగుతున్నారు.గంటా శ్రీనివాసరావు 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయ ఢంకా మోగించారు. 2014లో భీమిలిలో మళ్లీ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. గంటా రాజకీయ చరిత్ర చూస్తే, ఒకసారి పోటీ చేసిన చోట మరోసారి ఆయన పోటీ చేయలేదు. ప్రతి ఎన్నికకు కొత్త నియోజకవర్గం నుంచే బరిలో దిగుతున్నారు. ఈసారి 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఏదో ఒక కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అవంతి శ్రీనివాసరావు భావించారు. అందుకు తగ్గట్టుగానే గంటా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి పోటీ చేస్తారని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. గంటా ఎలాగూ భీమిలిలో పోటీ చేయరు కాబట్టి ఆ సీటు తనకే ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును అవంతి శ్రీనివాస్‌ కోరారు. ఇది తెలిసి గంటా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. మంత్రిని వుండగా తనను కాదని ఆయనకు టిక్కెట్‌ ఎలా ఇస్తారని పార్టీలో మిత్రుల వద్ద మనసు విప్పారు. ఈ వివాదాల నేపథ్యంలో ఎంతో సఖ్యతగా వుండే ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 


ఈ క్రమంలోనే రైల్వే జోన్‌ డిమాండ్‌ చేస్తూ అవంతి ప్రత్యేకంగా ఒక రోజు విశాఖ రైల్వేస్టేషన్‌ దగ్గర పార్టీ నాయకులతో కలిసి నిరాహారదీక్ష చేశారు. మూడు నెలల క్రితమేఇద్దరూ మళ్లీ కలిసి పోయారు. రాష్ట్రంలో శాంతిని కోరుతూ అవంతి ఇటీవల తగరపువలసలోని తన కళాశాలలో నాగసాధువులతో మహా రుద్రాభిషేకం చేయించారు. దానికి రమ్మని గంటా ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. దాంతో ఇద్దరూ కలిసిపోయారు. గంటా ఈసారి మళ్లీ భీమిలి నుంచే పోటీ చేయాలని తీర్మానించుకొని నియోజకవర్గం అభివృద్ధిపై గట్టిగా దృష్టి కేంద్రీకరించారు. దీంతో భీమిలి సీటు రాదని అవంతికి పూర్తిగా అర్థమైంది. 

విశాఖ ఉత్తరంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఉన్నారు. అక్కడ పార్టీకి ఇన్‌ఛార్జి ఎవరూ లేరు కాబట్టి తనకు ఇస్తే పార్టీ కార్యక్రమాలు చేసుకుంటానని సీఎంను కోరారు. దానికీ భరోసా లభించలేదు. ఆ సీటుకు పార్టీలో తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, మాజీ ఎంపీ సబ్బం హరితో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి స్వాతి కృష్ణారెడ్డి కోరుతున్నారు. దాంతో ఎటూ తేల్చలేదు. తాను ఏది అడిగినా పార్టీ ఇస్తామని కచ్చితంగా చెప్పడం లేదని, సరైన హామీ ఇవ్వడం లేదని అవంతి లోలోపల రగిలిపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలతో మంతనాలు మొదలెట్టారు. తనతో పాటు జిల్లాలో మరికొందరు ఎమ్మెల్యేలను కూడా తీసుకువస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. సీఎం పిలిచి మాట్లాడారు. తొందర పడవద్దని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రూరల్‌లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని చూచాయగా చెప్పారు. దీనితో అవంతి పార్టీ మారేందుకు ప్రణాలిక రచించారు, పార్టీ మారిపోయారు.

Post a Comment

0 Comments